చిన్నప్పుడు ఒట్టికాళ్లతో నడిచి బడికి వెళ్ళిన అబ్బాయి...ప్రస్తుత కాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాములోని చికాగో పట్టణంలో ఉన్నత ఉద్యోగం చేసేకి వెళ్ళడం అన్నది సామాన్యమైన విషయం కాదు. చెర్లపాలెం నుండి చికాగో కి చేరిన వ్యక్తి కథ ఇది. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరుకు దగ్గరలో ఉన్న ఒక చిన్న కు గ్రామం చెర్లపాలెం. అక్కడ పుట్టి, అక్కడే పెరిగి ప్రభుత్వ పాఠశాలలో చదివి, అయ్యో ఇలా చదివితే కాదు బాగా చదవాలి అని వారి తాత గారి ఊరు, తొర్రూరుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంత చిన్న వయసులో. కారణం అక్కడ మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుకోవచ్చు అన్న అపేక్షతో! అలా మొదలైన తన జీవితం CBIT కళాశాలలో ఇంజనీరింగ్ పట్టభద్రుడిగా మారేదాకా సాగింది. విశ్వవిద్యాలయ ఆవరణ నియామకాలలో భాగంగా అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం సాధించగలిగాడు.
చక్కటి ఉద్యోగం, చేతినిండా డబ్బులు... ఇవేవీ తనకు సంతృప్తి ఇవ్వలేదు. ఏదో చేయాలని, చిన్ననాడు తను పడిన కష్టాలే ఇంకెంతో మంది ఈ రోజుల్లో కూడా పడుతున్నారన్న విషయం గమనించి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల లేమినీ గుర్తించి, దిశా దశ లేకుండా గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు బ్రతికే విధానము...ఇలా ఇవన్నీ చూసి చలించిపోయి, ఆ గ్రామీణ ప్రాంతాల పిల్లల ముఖాలలో చదువుల చిరు నవ్వులు చూడాలన్న ఆలోచనతో 100 Smiles Charity Foundation స్థాపించాడు. తద్వారా మిత్రులు, శ్రేయోభిలాషులు, సహోద్యోగుల సహాయ సహకారాలతో ఎప్పుడు వీలైతే అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేవాడు. కేవలం మాటలతో సరిపుచ్చకుండా, అక్కడ మౌలిక సదుపాయాలు లేమిని గుర్తించి, తనకు తోచిన విధంగా వ్యాపార సంస్థల నుండి సేకరించిన విరాళాలతో తన సొంత వనరులు వెచ్చించి ప్రభుత్వ బడులలో కాస్త కోస్తూ మంచి పని చేసేవాడు. తద్వారా అక్కడి విద్యార్థిని విద్యార్థుల హృదయాలలో ఆత్మవిశ్వాసాన్ని రగల్చాడు.
సుమారు దశాబ్ద కాలం నుండి సాగుతున్న ఈ సేవా ప్రస్థానంలో భాగంగా అతను 50 ప్రభుత్వ పాఠశాలలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, 500 మంది ఉపాధ్యాయులను ఉత్సాహపరచడం, సుమారు 20000 మంది విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది.
అంతటితో ఆగలేదు, విదేశాలలో ఉద్యోగం చేయాలన్న తపనతో హైదరాబాదు నుండి అమెరికా సంయుక్త రాష్ట్రములోని చికాగో పట్టణానికి చేరాడు. మధ్యలో వివాహం కూడా చేసుకున్నాడు. భార్యా బిడ్డ, అమ్మానాన్న, అన్నా వదిన... కుటుంబం అంతా ఉన్న సరే, తన నిజ ఆనందాన్ని సేవలో వెతుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇతని పేరు మనోజ్ కుమార్ చిట్టిమల్ల అప్పుడెప్పుడో ఒక సేవా కార్యక్రమంలో నన్ను కలిశాడు. ఆనాటి నుండి నేటిదాకా అభయ ఫౌండేషన్ 100 స్మైల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నో పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది.
ఇతని గురించి చెప్పడం అంటే ఒక కదిలే ఉత్సాహం ఎలా ఉంటుందో చూపించడమే అవుతుంది. ఒక నడిచే సేవకుడిని పరిచయం చేయడమే అవుతుంది. వీరు మరియు వీరి బృందము 100 స్మైల్స్ ఫౌండేషన్ ని అలా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు
*వీరి నుండి నేను నేర్చుకున్న పాఠాలు*
సేవ అంటే బాధ్యత, బరువు కాదు...
సేవ అంటే సదా ప్రవహించే ఉత్సాహము!!
సేవ అంటే అన్ని వదిలి వెళ్లడం కాదు...
సేవ చేయి చేయి కలిపి చేయడం!!
సేవలో ప్రణాళిక, పత్రాలు, నిర్వహణ, యాజమాన్యం మరియు పారదర్శకత ప్రాధాన్యత.
ఒకసారి పట్టుకుంటే అనుకున్నది సాధించేదాకా విశ్రమించని వైనం!! స్వచ్ఛంద సంస్థల సంయుక్త భాగస్వామ్యం... పరస్పర గౌరవంతో ఎలా చేయొచ్చు
ఇలా ఎన్నో పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను. మనోజ్ కుమార్ మరియు 100 స్మైల్ చారిటీ ఫౌండేషన్ తెలంగాణలో ఒక నమ్మకమైన భాగస్వామిగా అభయ ఫౌండేషన్తో నిలచింది అంటే ఎట్టి సందేహము లేదు. సేవ అనేది సమాజంలో మార్పు కోసం కాదు సేవ అనేది స్వీయ పరివర్తనకై అన్న సత్యసాయి సూత్రము ఇట్టి వారి జీవితంలో ప్రతిబింబిస్తుండడం చూస్తుంటే ఎంతో ఆనందం అవుతుంది.
Published on 07 Sep 2025
Back to Articles